శ్రీవారి కృపతోనే విజయం సాధించాం.... బొజ్జల రిషితా రెడ్డి
రాజకీయ విజయాన్ని కేవలం వ్యక్తిగత విజయంగా కాకుండా దైవానుగ్రహం, ప్రజల ఆశీస్సుల ఫలితంగా భావిస్తూ మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకునేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్ర భక్తి, విశ్వాసం, కృతజ్ఞతలకు ప్రతీకగా నిలిచింది. స్వగ్రామం నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి సన్నిధికి బయలుదేరిన ఆమెకు మార్గమధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనవిగా నిలిచాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం కోసం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సతీమణి రిషితా రెడ్డి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ, తన భర్త ఘన విజయం సాధిస్తే స్వగ్రామం నుంచి తిరుమల వరకు కాలినడకన పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 43 వేలకుపైగా భారీ మెజారిటీతో విజయం సాధించడంతో, శ్రీవారికి చేసిన మొక్కును నెరవేర్చుకునేందుకు రిషితా రెడ్డి శనివారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఊరందూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన రిషితా రెడ్డి, అనంతరం స్వామివారి నామస్మరణతో యాత్రను ప్రారంభించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా కొంతదూరం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర మార్గమంతా భక్తి గీతాలు, గోవింద నామస్మరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రిషితా రెడ్డి ప్రతి అడుగులోనూ శ్రీవారిపై తనకున్న అపారమైన విశ్వాసాన్ని చాటుకున్నారు. పాదయాత్ర రేణిగుంట పట్టణంలోని ప్రముఖ రమణ విలాస్ కూడలికి చేరుకోగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రిషితా రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గజమాలలు వేసి సత్కరించడంతో పాటు పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై సుధీర్ రెడ్డి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, శ్రీవారి కృప వల్లే సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారని, ఆ విజయానికి గుర్తుగా రిషితా రెడ్డి చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం కావడంతో పాదయాత్ర మార్గంలోనే ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిషితా రెడ్డి, బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రిషితా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము ఎంతో విశ్వాసంతో స్వామివారిని ప్రార్థించామని, ఆయన అనుగ్రహంతోనే సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారని అన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి, శ్రీవారి కృప వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. నేను మొక్కుకున్న విధంగా తిరుమలకు పాదయాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ యాత్రను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో విజయాలు వచ్చినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలియజేయడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. రిషితా రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర యువతకు, మహిళలకు మంచి సందేశాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు. మొక్కుకున్న మాటను నిలబెట్టుకోవడం, ప్రజలతో మమేకమవుతూ పాదయాత్ర చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట టీడీపీ మండల అధ్యక్షుడు మునుచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, జిపాలెం రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్‌చార్జ్ పుష్పనాదం, ఆటక అకాడమీ డైరెక్టర్ లువీనా మేరీ, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.