🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jun, 2026 | Page: 1

నీళ్ల విరోచనాలకు ఓ.ఆర్.ఎస్. సంజీవని: డిప్యూటీ హెచ్.ఈ.ఓ. మహమ్మద్ రఫీ

వాయల్పాడు (రాజనీతి, జూన్ 17: నీళ్ల విరోచనాలను (డయేరియా) సమర్థవంతంగా నియంత్రించడంలో ఓ.ఆర్.ఎస్. (ORS) పొడి సంజీవనిలా పనిచేస్తుందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. 'స్టాప్ డయేరియా కాంపెయిన్'లో భాగంగా బుధవారం ఆయన గండబోయినపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీకాల కొరకు చిన్నారులతో హాజరైన తల్లులకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్.ఈ.ఓ. మాట్లాడుతూ.. జూన్ 16 నుండి జూలై 31 వరకు 'స్టాప్ డయేరియా' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. నీళ్ల విరోచనాల వల్ల ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా చూడటం, మరణాలు సంభవించకుండా నిరోధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. రోజుకు 4 లేదా 5 సార్లు పలుచటి నీళ్ల మాదిరి విరోచనాలు అయితే వాటిని డయేరియాగా గుర్తిస్తారని, ఇది ఒక వైరస్ వల్ల వస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించాలని, చేతుల శుభ్రతను నిరంతరం పాటించాలని కోరారు. ఆరు నెలల లోపు చిన్నారులకు తల్లిపాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. తాగునీటిని తప్పనిసరిగా కాచి, చల్లార్చి తాగాలని, చద్ది ఆహార పదార్థాలు తినకుండా ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినాలని సూచించారు. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తల్లులకు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్.ఎల్.హెచ్.పి. మౌనిక, ఏ.ఎన్.ఎమ్. రాణి, ఆశా కార్యకర్త నీలావతి, చిన్నారుల తల్లులు మరియు వారి సహాయకులు పాల్గొన్నారు.
🏠 Home