🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Oct, 2026 | Page: 1

ఏపీ ఉద్యోగులకు దసరా కానుక.. వరుసగా నాలుగు రోజులు సెలవులు!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 17, 2026

దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. అక్టోబర్‌ 19వ తేదీ సోమవారాన్ని అదనపు సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకుంది.

సోమవారం కూడా సెలవే!

అక్టోబర్‌ 17న శనివారం, 18న ఆదివారం సెలవులు ఉండగా, 20వ తేదీ మంగళవారం విజయదశమి పండుగ సెలవుగా ఉంది. మధ్యలో అక్టోబర్‌ 19న సోమవారం పని దినం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ఉద్యోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారాన్ని కూడా సెలవుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సోమవారం అదనపు సెలవు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు వర్తించనుంది.

ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మినహాయింపు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ అదనపు సెలవు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అత్యవసర విధులు యథావిధిగా కొనసాగనున్నాయి.

నవంబర్‌ 14న పని చేయాల్సిందే

అక్టోబర్‌ 19న ప్రకటించిన అదనపు సెలవుకు బదులుగా నవంబర్‌ 14వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో అదనపు సెలవును ప్రత్యామ్నాయ పని దినంతో సర్దుబాటు చేసినట్లయింది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు వరుస సెలవులు ఉపయోగపడతాయని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపాయి.
🏠 Home