🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 14 Oct, 2026 | Page: 1

ఏపీకి మూడు రోజుల వర్ష సూచన.. పిడుగులతో అప్రమత్తం!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 14, 2026

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా తోడవడంతో అక్టోబర్‌ 14 నుంచి 16 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం | నేడు 11 జిల్లాల్లో వర్షాలకు అవకాశం | 15న కోనసీమ, కృష్ణా.. 16న అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వానలు.....

బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

గురువారం కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముంది.

శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని వెల్లడించారు. భారత వాతావరణ శాఖ కూడా అక్టోబర్‌ 16న కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.

వర్షాలతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాల సమీపంలో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వాతావరణ పరిస్థితులను గమనించి వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించింది. జిల్లాలవారీగా వర్షాల తీవ్రత మారే అవకాశం ఉన్నందున తాజా హెచ్చరికలను అనుసరించాలని అధికారులు కోరారు.
🏠 Home