🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Oct, 2026 | Page: 1

ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది.. భారత్‌ సవాళ్లను ఎదుర్కొంటుంది: జైశంకర్‌

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 5, 2026

ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అస్థిరతతో కూడిన దశలో ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 5వ కౌటిల్య ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌ ముగింపు సమావేశంలో ఆయన ప్రపంచ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇరాన్‌ ఘర్షణలతో పాటు టారిఫ్‌లలో మార్పులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

‘చాలా మార్పులు జరుగుతున్న కాలం’

యుద్ధాలు.. టారిఫ్‌ల అస్థిరత.. ఇంధనం, ఆహారం, ఎరువులపై ఒత్తిడి.. మారుతున్న ప్రపంచ పరిస్థితులపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు


ప్రపంచం ఒక రకంగా “ఏజ్‌ ఆఫ్‌ ఫ్లక్స్‌”లోకి ప్రవేశించిందని జైశంకర్‌ అభివర్ణించారు. రెండు ప్రధాన యుద్ధాలతో పాటు ఇతర భౌగోళిక ఉద్రిక్తతలు, మార్కెట్‌ వెలుపలి ప్రభావాలు, టారిఫ్‌లలో అస్థిరత కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ముందున్న మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు.

ఇంధనం.. ఆహారం.. ఎరువులు కీలకం

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇంధనం, ఆహారం, ఎరువులు వంటి అంశాలను దేశాల విధాన రూపకల్పనలో కీలకంగా పరిగణించాల్సి ఉంటుందని జైశంకర్‌ అన్నారు. ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై ఈ పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వివరించారు.

రష్యా–ఉక్రెయిన్‌తో భారత్‌ చర్చలు

బ్లాక్‌ సీ ప్రాంతంలో ధాన్యం, ఇంధనం వంటి సరుకుల రవాణాకు భద్రత కల్పించే అంశంపై భారత్‌ రష్యా, ఉక్రెయిన్‌ రెండింటితోనూ సంప్రదింపులు కొనసాగిస్తోందని విదేశాంగ మంత్రి తెలిపారు. పౌర నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదని భారత్‌ స్పష్టం చేసిందన్నారు. యుద్ధానికి పరిష్కారం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సాధ్యమని భారత్‌ వైఖరిని పునరుద్ఘాటించారు.

ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు అవసరమని జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఉందని, కొన్ని దేశాలు సంస్కరణలను అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఆందోళనలను అంతర్జాతీయ వేదికలపై మరింత సమర్థంగా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సవాళ్లను ఎదుర్కొంటాం: జైశంకర్‌

కరోనా సమయంలోనూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల సమయంలోనూ భారత్‌ పరిస్థితులకు అనుగుణంగా స్పందించిందని జైశంకర్‌ అన్నారు. ప్రస్తుత “చంచలమైన” అంతర్జాతీయ వాతావరణంలోనూ దేశం సవాళ్లను ఎదుర్కొంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

యుద్ధాల నుంచి టారిఫ్‌ల వరకు.. ఆహారం, ఇంధనం నుంచి ఎరువుల వరకు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిళ్ల మధ్య భారత్‌ తన వ్యూహాన్ని మరింత అనుకూలంగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
🏠 Home