🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Oct, 2026 | Page: 1

పేదలను రాజకీయాలకు అడ్డుపెట్టుకోవడం సరికాదు... బుజ్జి నాయుడు

రేణిగుంట, అక్టోబరు 3 (రాజనీతి): రేణిగుంట మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో రోడ్డు విస్తరణకు సంబంధించి ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చొరవ తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తారకరామనగర్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ బుజ్జి నాయుడు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2023లో శ్రీనివాసపురం ప్రాంతానికి సంబంధించి అవార్డు ప్రక్రియ జరిగినప్పటికీ కొంతమంది బాధితులకు మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన బాధితుల సమస్యను 2024 ఎన్నికల సమయంలో తమ దృష్టికి తీసుకురావడంతో, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని బుజ్జి నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శ్రీనివాసపురం బాధితుల సమస్యను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్వయంగా బాధితులను కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడారని పేర్కొన్నారు. బాధితుల సమస్యపై కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులతోనూ ఎమ్మెల్యే పలుమార్లు మాట్లాడారని తెలిపారు. ఒక సెంటు స్థలానికి సంబంధించిన పరిహారం ఉన్న చోట అర్హత మేరకు మరింత న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను కోరినట్లు చెప్పారు. రెవెన్యూ మంత్రి పర్యటన సందర్భంగా కూడా బాధితుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు బుజ్జి నాయుడు వివరించారు. శ్రీనివాసపురం బాధితులు ఎమ్మెల్యేను కలిసిన ప్రతిసారీ ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని బుజ్జి నాయుడు తెలిపారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే ఈ అంశాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పేదల సమస్యలను రాజకీయ కక్షలకు అడ్డుపెట్టుకోవద్దని సూచించారు. సమస్యలపై రాజకీయంగా విభేదాలు ఉంటే వాటిని రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప, పేద ప్రజలను మధ్యలోకి లాగడం వల్ల చివరకు నష్టపోయేది బాధితులేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కావాలనే బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని కొందరు చేస్తున్న ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బుజ్జి నాయుడు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా పేదలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయిస్తున్నారని, వారికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యను వింటున్నారని చెప్పారు.
సుధీర్‌రెడ్డి కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, ప్రజలను గౌరవించడం వారి కుటుంబ సంప్రదాయమని బుజ్జి నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చే ప్రజలను గౌరవంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. శ్రీనివాసపురం బాధితుల సమస్యకు పరిష్కారం లభించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని, పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. పేద ప్రజలను రాజకీయ వివాదాలకు అడ్డుపెట్టుకోవడం మానుకోవాలని మీడియా వేదికగా బుజ్జి నాయుడు విజ్ఞప్తి చేశారు.
🏠 Home