వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వాయల్పాడు అక్టోబర్ 1 (రాజనీతి): వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారిని గౌరవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా చింతపర్తి సర్వోదయ వృద్ధాశ్రమంలో డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 25 మంది వృద్ధులకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వృద్ధులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పౌష్టికాహారం తీసుకుని నిత్యం నడక, వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ అరుణ, పర్యవేక్షకులు భానుబి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.