🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Oct, 2026 | Page: 1

వాట్సాప్‌ బిజినెస్‌లో కొత్త రూల్స్‌.. కొన్ని మెసేజ్‌లు ఇక ఆగిపోవచ్చు!

రాజనీతి | బిజినెస్‌ | అక్టోబర్‌ 1, 2026

వాట్సాప్‌ను వ్యాపార అవసరాలకు ఉపయోగించే కంపెనీలకు మెటా కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్టోబర్‌ 1, 2026 నుంచి WhatsApp Business Platformలో కొన్ని సర్వీస్‌, యుటిలిటీ మెసేజ్‌లకు ఛార్జీలు వర్తించనున్నాయి. ముఖ్యంగా కస్టమర్లు పంపిన మెసేజ్‌లకు వ్యాపారాలు ఇచ్చే కొన్ని సర్వీస్‌ రిప్లైలపై కొత్త చార్జింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది.

నెలకు 1,000 సర్వీస్‌ మెసేజ్‌లు ఉచితం
అక్టోబర్‌ 1 నుంచి మారిన ఛార్జింగ్‌ విధానం.. పేమెంట్‌ మెథడ్‌ లేకపోతే కొన్ని బిజినెస్‌ మెసేజ్‌ల డెలివరీ నిలిచే అవకాశం

భారత్‌లో ప్రతి బిజినెస్‌ ఫోన్‌ నంబర్‌కు నెలకు మొదటి 1,000 సర్వీస్‌ మెసేజ్‌లు ఉచితంగా ఉంటాయి. ఆ పరిమితి దాటిన తర్వాత అదనపు సర్వీస్‌ మెసేజ్‌కు ₹0.115 చొప్పున ఛార్జ్‌ విధించనుంది మెటా. ఇవి సాధారణంగా కస్టమర్‌ నుంచి మెసేజ్‌ వచ్చిన తర్వాత ఓపెన్‌గా ఉన్న 24 గంటల కస్టమర్‌ సర్వీస్‌ విండోలో పంపే నాన్‌-టెంప్లేట్‌ రిప్లైలు.

ఆర్డర్‌, డెలివరీ అప్‌డేట్లకూ ఛార్జీ

కస్టమర్‌ ఆర్డర్‌ కన్ఫర్మేషన్‌, షిప్పింగ్‌, డెలివరీ అప్‌డేట్‌ వంటి యుటిలిటీ మెసేజ్‌లు కూడా ఇక పూర్తిగా ఉచితం కావు. 24 గంటల కస్టమర్‌ సర్వీస్‌ విండోలో పంపినప్పటికీ వాటికి సంబంధిత ఛార్జీలు వర్తించనున్నాయి. భారత్‌లో యుటిలిటీ మెసేజ్‌కు మెటా రేటు ₹0.115 per delivered messageగా పేర్కొంది.

పేమెంట్‌ మెథడ్‌ లేకుంటే మెసేజ్‌లు ఆగొచ్చు

WhatsApp Business Platformను నేరుగా లేదా సొల్యూషన్‌ ప్రొవైడర్‌ ద్వారా ఉపయోగించే సంస్థలు తమ మెసేజింగ్‌ అకౌంట్‌కు పేమెంట్‌ మెథడ్‌ జోడించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 30లోపు పేమెంట్‌ మెథడ్‌ నమోదు చేయని కొన్ని బిజినెస్‌ అకౌంట్లకు అక్టోబర్‌ 1 నుంచి సర్వీస్‌ మెసేజ్‌ల డెలివరీ నిలిపివేస్తామని మెటా హెచ్చరించింది.

సాధారణ వాట్సాప్‌ వినియోగదారులకు ఛార్జీలు లేవు

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సాధారణ WhatsApp ఉపయోగించే వ్యక్తులకు ఈ మార్పు వర్తించదు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపడం, బిజినెస్‌ అకౌంట్లకు కస్టమర్‌గా మెసేజ్‌ చేయడం కోసం వినియోగదారుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయరు. అలాగే ఈ మార్పు సాధారణ WhatsApp యాప్‌కు లేదా సాధారణ WhatsApp Business App వినియోగానికి వర్తించదని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరు ప్రభావితమవుతారు?

ప్రధానంగా WhatsApp Business Platformను API/ఇంటిగ్రేషన్‌ ద్వారా ఉపయోగించే కంపెనీలు, బ్యాంకులు, ఈ-కామర్స్‌ సంస్థలు, పెద్ద వ్యాపారాలు, కస్టమర్‌ సపోర్ట్‌ సేవలు ఈ మార్పును ఎదుర్కొంటాయి. వినియోగదారులు మాత్రం మెసేజ్‌ అందుకున్నందుకు లేదా పంపినందుకు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

అంటే.. వాట్సాప్‌ అందరికీ ఛార్జీలు పెడుతోంది అనుకోవాల్సిన అవసరం లేదు. మార్పు ప్రధానంగా WhatsApp Business Platformను ఉపయోగించే వ్యాపారాల మెసేజింగ్‌ ఖర్చులపై ప్రభావం చూపుతుంది.
🏠 Home