🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Sep, 2026 | Page: 1

అమెరికా–ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్టంభన.. ఖతార్‌ రాయబారం విఫలం!

రాజనీతి | అంతర్జాతీయం | సెప్టెంబర్‌ 30, 2026

అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు ఖతార్‌ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. న్యూయార్క్‌లో ఇరాన్‌ ప్రతినిధులతో, అనంతరం అమెరికా అధికారులతో ఖతార్‌ మధ్యవర్తులు చర్చలు జరిపినా.. కీలక అంశాలపై ఇరు దేశాలూ తమ వైఖరి మార్చుకోకపోవడంతో ముందడుగు పడలేదు.

రెండు దేశాలూ తమ షరతులపైనే

అణు కార్యక్రమంపై అమెరికా షరతులు.. నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేయాలన్న ఇరాన్‌ డిమాండ్‌.. మధ్యవర్తిత్వంతోనూ కుదరని ఒప్పందం


ఇరాన్‌పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని టెహ్రాన్‌ కోరుతోంది. మరోవైపు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేలా స్పష్టమైన హామీలు కావాలని అమెరికా కోరుతున్నట్లు చర్చలకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఈ రెండు అంశాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్‌ ప్రతిపాదన రూపొందించినా.. దానిపై ఏకాభిప్రాయం రాలేదు.

ఖతార్‌ రాయబారి అలీ అల్‌-థవాదీ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో న్యూయార్క్‌లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం అమెరికా అధికారులతోనూ చర్చలు జరిపారు. ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాల మధ్య ఒక ఉమ్మడి అవగాహనకు రావాలని ఖతార్‌ ప్రయత్నిస్తోంది.

ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ అణు కార్యక్రమంపై రాయితీలు ఇస్తే ఆంక్షలు సడలించి, నిలిపివేసిన నిధుల విషయంలో వెసులుబాటు కల్పించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా ఖండించారు. తాము ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదని ఆయన సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

అదే సమయంలో ఇరాన్‌ అణ్వాయుధాన్ని పొందకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఒత్తిడి లేదా బలవంతపు షరతులను అంగీకరించబోమని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది.

హోర్ముజ్‌పైనా కీలక చర్చ

అమెరికా–ఇరాన్‌ వివాదంలో హోర్ముజ్‌ జలసంధి మరో ప్రధాన అంశంగా మారింది. ఇరాన్‌ ప్రతిపాదనలో కాల్పుల విరమణకు దారితీసే చర్యలతో పాటు జలసంధిని తిరిగి తెరవడంపై చర్చ ఉంది. అయితే దాన్ని ఏ క్రమంలో అమలు చేయాలన్న విషయంలోనూ విభేదాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఖతార్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పూర్తిగా నిలిపివేయలేదని ఆ దేశం చెబుతోంది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కొనసాగుతోందని ఖతార్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే అణు కార్యక్రమం, ఆంక్షలు, హోర్ముజ్‌ జలసంధి వంటి కీలక అంశాలపై రాజీ కుదరాల్సి ఉంది.

దౌత్య చర్చలకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు.. కానీ కీలక షరతులపై ఇరు దేశాల మధ్య దూరం మాత్రం ఇంకా కొనసాగుతోంది.
🏠 Home