🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 26 Sep, 2026 | Page: 1

SIR వివాదంపై ఈసీ కీలక స్పష్టత.. ఫామ్‌-6 నుంచి క్యాబినెట్‌ సెక్రటరీ లేఖ వరకు!

రాజనీతి | న్యూఢిల్లీ | సెప్టెంబర్‌ 26, 2026

ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR), ఫామ్‌-6లో మార్పులు, ఈసీనెట్‌ వ్యవస్థపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి సెప్టెంబర్‌ 26న న్యూఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో సమావేశమయ్యారు. అనంతరం వివిధ అంశాలపై కమిషన్‌ వివరణ ఇచ్చింది.

ముగ్గురు కమిషనర్ల భేటీ.. ఎస్‌ఐఆర్‌ నిర్ణయాలపై వివరణ.. ఈసీనెట్‌ సమీక్షకు ఆదేశాలు.. ఓటర్లకు మరిన్ని వెసులుబాట్లు


SIR నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనన్న ఈసీ

SIRకు సంబంధించిన కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2025 జూన్‌ 24న జారీ చేసిన SIR ఆదేశాలతో పాటు తదుపరి దశలకు సంబంధించిన షెడ్యూళ్లు కూడా ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని తెలిపింది. 2026 మే 27న సుప్రీంకోర్టు SIRకు సంబంధించిన ప్రాథమిక ఆదేశాన్ని సమర్థించిందని కూడా ఈసీ పేర్కొంది.

ఫామ్‌-6పై ఏమన్నారంటే?

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్‌-6కు జత చేసిన డిక్లరేషన్‌పై కూడా ఈసీ స్పష్టత ఇచ్చింది. SIR సమయంలో ఈ డిక్లరేషన్‌ విధానాన్ని అనుసరించడం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే ఉందని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈసీ ప్రస్తావించింది. SIR పరిధిలో లేని సాధారణ కాలంలో మాత్రం రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ రూల్స్‌–1960 ప్రకారం దరఖాస్తులు కొనసాగుతాయని తెలిపింది.

నోటీసులు అందుకున్న ఓటర్లకు ఊరట

SIRలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ప్రతిసారీ వ్యక్తిగతంగా ERO లేదా AERO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. సాధారణంగా BLOలు ఇంటికి వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి ECINETలో అప్‌లోడ్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విచారణకు పిలుస్తారు; వీలైనంత వరకు ఆ విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటారు.

ECINETపై ప్రత్యేక సమీక్ష

ఎన్నికల జాబితా నిర్వహణలో ఉపయోగిస్తున్న ECINET వ్యవస్థను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో IIT లేదా IIITకు చెందిన స్వతంత్ర నిపుణుడిని కూడా చేర్చనున్నట్లు వెల్లడించింది. సాంకేతిక వ్యవస్థలో అవసరమైన మార్పులను అధికారుల సూచనల ఆధారంగా పరిశీలించనున్నట్లు తెలిపింది.

క్యాబినెట్‌ సెక్రటరీకి లేఖపై వివరణ

ఇటీవల ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్‌ సెక్రటరీకి రాసిన లేఖపై కూడా చర్చ జరిగింది. ఆ లేఖ ఎన్నికల సంఘం విధాన నిర్ణయం లేదా IT విభాగానికి సంబంధించిన విధాన అంశం కాదని, ఈసీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ అధికారి విధులకు సంబంధించిన వ్యవహారమని కమిషన్‌ వివరించింది. సంబంధిత అధికారి జారీ చేసిన పని పునర్విభజన ఆదేశాలు ఇద్దరు కమిషనర్ల ఆదేశాల తర్వాత అమలు కాలేదని, IT విభాగంపై డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ పర్యవేక్షణ కూడా తొలగించలేదని తెలిపింది.

ఇకపై సమావేశాల వివరాలపైనా మార్పులు

కమిషన్‌ సమావేశాలకు సంబంధించిన అజెండాను ముందుగానే పంచుకోవడం, సమావేశాల మినిట్స్‌ నమోదు చేయడం వంటి విధానాలను అమలు చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. SIRలో మిగిలిన ప్రక్రియలు, ఓటర్ల క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించిన గడువులపైనా కొన్ని మార్పులు చేసింది. ఢిల్లీలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల గడువును అక్టోబర్‌ 30 వరకు, మహారాష్ట్రలో అక్టోబర్‌ 12 వరకు పొడిగించింది.

SIRపై కొనసాగుతున్న చర్చల మధ్య.. ఫామ్‌-6, ECINET, క్యాబినెట్‌ సెక్రటరీకి లేఖ వంటి అంశాలపై ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా వివరణలు ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
🏠 Home