రాజకీయ వైకుంఠపాలిలో ఎస్సీలను నిచ్చెనలుగా వాడుకుంటే పతనం తప్పదు
పీలేరు, సెప్టెంబరు 24 (రాజనీతి): ఎన్నికల సమయంలో ఎస్సీ నాయకులను ఓట్ల కోసం నిచ్చెనలుగా వాడుకుని, అధికారం దక్కాక పక్కనపెట్టే రాజకీయ పార్టీలకు పతనం తప్పదని మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల ధరణ్ కుమార్ హెచ్చరించారు. ఎస్సీ నాయకులకు పదవులు, కీలక నిర్ణయాధికారాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించకుండా ప్రచారానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు. దళిత సమాజంలో రాజకీయ చైతన్యం పెరిగిందని, సమాన భాగస్వామ్యం, ఆత్మగౌరవం కల్పించని పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఎస్సీలను నిచ్చెనలుగా వాడుకునే అవకాశవాద రాజకీయాలకు కాలం చెల్లిందని, నిజమైన సామాజిక న్యాయంతోనే రాజకీయ పార్టీలు మనుగడ సాగించగలవని ధరణ్ కుమార్ స్పష్టం చేశారు.