🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Sep, 2026 | Page: 1

నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలి... ఎంపీడీవో మనోహర్‌రాజు

వాయల్పాడు, సెప్టెంబరు 22 (రాజనీతి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలని వాయల్పాడు ఎంపీడీవో మనోహర్‌రాజు పిలుపునిచ్చారు. మంగళవారం వాయల్పాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా. మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వాయల్పాడు మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 6,452 మంది విద్యార్థులకు మాత్రలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించడంతో పాటు రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది ఆగస్టు, ఫిబ్రవరి నెలల్లో రెండుసార్లు ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 25న పాఠశాలలకు గైర్హాజరయ్యే పిల్లలకు అక్టోబరు 5న మాత్రలు అందజేస్తామని తెలిపారు. పంపిణీ వివరాలను సంబంధిత యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, డాక్టర్‌ రిచర్డ్‌ స్టీఫిన్‌, ఎంఈవో వెంకటలక్ష్మి, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ, జూనియర్‌ అసిస్టెంట్‌ శంకర్‌, హౌసింగ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్లు, ఎంఎల్‌హెచ్‌పీ అమృత, ఏఎన్‌ఎం సరోజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home