ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తే లక్ష్యం
తిరుపతి, సెప్టెంబరు 22 (రాజనీతి): ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యమని కలెక్టర్ డా. ఎస్.వేంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కచ్చాపి ఆడిటోరియంలో మంగళవారం 6వ ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్ నిర్వహించారు. మహిళా సాధికారతకు ‘లఖ్పతి దీదీ’ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువత, మహిళలకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు ఆధునిక సాంకేతికత, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్‌ను వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందించే రుణాలు, రాయితీలు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీఎం డీఐసీ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.