సీఎం కుప్పం పర్యటన విజయవంతానికి శాఖల సమన్వయం
కుప్పం, సెప్టెంబరు 20 (రాజనీతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషార్ డూడి ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజాన్)లో భాగంగా ఆదివారం పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ జలహారతి, రైతుబజార్ శంకుస్థాపన స్థలం, బహిరంగ సభ ప్రాంగణం, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. రూ.289.5 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, రూ.38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. స్వర్ణ కుప్పం విజయాల గ్యాలరీ, లబ్ధిదారులతో ముఖాముఖి, హిందాల్కో ప్రతినిధులతో సమావేశం, జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు.