రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం.
చౌడేపల్లి, సెప్టెంబరు 19 (రాజనీతి): ఒకవైపు ఆరు నెలల క్రితమే వివాహమై.. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భార్యతో కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్.. మరోవైపు కుటుంబానికి అండగా నిలుస్తూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్న సంతోష్.. ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఈ రెండు కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. చౌడేపల్లి మండలం చిట్రెడ్డిపల్లి సమీపంలో శనివారం రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మహేష్, సంతోష్ అక్కడికక్కడే మృతిచెందారు. మహేష్ స్థానిక ఇండియన్ బ్యాంకులో స్కావెంజర్‌గా పనిచేస్తుండగా, బ్యాంకు పని నిమిత్తం మేనేజర్ నరేంద్రతో కలిసి పలమనేరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో స్కూటర్‌పై సంతోష్, చంద్రశేఖర్ పలమనేరుకు వెళ్తున్నారు. ప్రమాదంలో మేనేజర్ నరేంద్ర కుడికంటికి తీవ్ర గాయం కాగా, చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేష్ మృతితో నాలుగు నెలల గర్భిణిగా ఉన్న ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది. ఇద్దరు యువకుల అకాల మరణంతో చౌడేపల్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.