🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Sep, 2026 | Page: 1

ప్రభుత్వ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరపాలి

రేణిగుంట, సెప్టెంబర్‌ 10 (రాజనీతి): రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించేందుకు బస్టాండ్‌ వద్దకు వచ్చినట్లు తెలిపారు. రేణిగుంట మండలంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని చింతా మోహన్‌ ఆరోపించారు. అన్నాస్వామిపల్లి, అల్లిమిట్ట, ఎంఆర్‌ఓ కార్యాలయం సమీపం, గురుకుల పాఠశాల పక్కన, తిమ్మయ్యగుట్ట, వేణుగోపాలపురం, ఎల్లమండ్యం ఎస్సీ కాలనీ సమీపం, తూకివాకం రహదారి మధ్య, వెంకటాపురం రోడ్డు పక్కన, చంగారెడ్డిపల్లి, సాక్షి పత్రిక కార్యాలయం ఎదురుగా, జగన్మోహన్‌రెడ్డి పత్రిక కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 300 ఎకరాల భూముల విలువ దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని, ఇంత విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు.
🏠 Home