కట్ట పుట్టలమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఏర్పాట్ల పరిశీలన
రేణిగుంట, సెప్టెంబర్ 8 (రాజనీతి): రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల నేపథ్యంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన ఏర్పాట్లను రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర మంగళవారం పరిశీలించారు. ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే వాహనాలు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పాయింట్ల వద్ద పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, వాహనాల మళ్లింపు, భక్తుల రాకపోకల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జాతర సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని తెలిపారు.