🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Aug, 2026 | Page: 1

వానొస్తే.. విద్యుత్‌తో జాగ్రత్త!...మునిచంద్ర ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌...

చిత్తూరు(ఆగస్టు 25),(ప్రభ ఎక్స్ ప్రెస్) డైలీ దినపత్రిక: వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్‌ చిత్తూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మునిచంద్ర సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. తడి నేల, నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్‌ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.విద్యుత్‌ తీగలు తెగిపడి నేలపై కనిపించినా వాటిని తాకడం, పక్కకు తొలగించడం చేయరాదని సూచించారు. చిన్నపిల్లలు సైతం వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో తడి చేతులతో స్విచ్‌లు, విద్యుత్‌ పరికరాలను తాకరాదని చెప్పారు. ఇళ్లలో విద్యుత్‌ వైర్లు, ప్లగ్‌లు, స్విచ్‌లు దెబ్బతిన్నట్లయితే వెంటనే నిపుణులైన ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు.ఈదురుగాలులకు చెట్లు, కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునిచంద్ర తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వెళ్లరాదన్నారు. విద్యుత్‌ తీగలకు చెట్లు లేదా ఇతర వస్తువులు తగిలిన సందర్భంలో ప్రజలు స్వయంగా వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. వర్షాకాలంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ప్రజలు సహనంతో వ్యవహరించాలని, భద్రతా చర్యలు పూర్తయ్యే వరకు ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలను నివారించడంలో ప్రజల అప్రమత్తత ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యుత్‌ శాఖకు సహకరించాలని మునిచంద్ర విజ్ఞప్తి చేశారు.
🏠 Home