🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Aug, 2026 | Page: 1

క్రికెటర్‌ తిలక్‌ వర్మకు ఘన స్వాగతం

రేణిగుంట, ఆగస్టు 17 (రాజనీతి): భారత యువ క్రికెట్‌ సంచలనం, తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం సోమవారం ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. తిలక్‌ వర్మ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్‌ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచి పేరు తీసుకువస్తున్నందుకు అభినందనలు తెలిపారు. తిలక్‌ వర్మను చూసేందుకు విమానాశ్రయం వద్ద అభిమానులు ఉత్సాహం చూపించారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. అభిమానులను నిరాశపరచకుండా తిలక్‌ వర్మ కూడా ఆత్మీయంగా పలకరిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ రాకతో రేణిగుంట విమానాశ్రయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. అనంతరం తిలక్‌ వర్మ రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిలక్ వర్మకు స్వాగతం పలికిన వారిలో టిడిపి యువ నాయకులు బుల్లెట్ బాబు, కిరణ్, సుమన్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home