🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక!

రాజనీతి | అంతర్జాతీయ వార్తలు | ఆగస్టు 15, 2026

7.7 తీవ్రతతో కంపించిన ఫ్లోరెస్‌ ప్రాంతం.. భయంతో ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజలు

ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్‌ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. సముద్ర తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో అధికారులు అప్రమత్తమై కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రుల నుంచి రోగులను సైతం బయటకు తరలించినట్లు సమాచారం.

సునామీ హెచ్చరిక జారీ.. ఆపై ఎత్తివేత

భూకంపం అనంతరం ఇండోనేషియా అధికారులు తీర ప్రాంత ప్రజలను సముద్ర తీరాలు, నదీ తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్‌ కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి. పరిస్థితిని సమీక్షించిన అనంతరం సుమారు మూడు గంటల తర్వాత సునామీ హెచ్చరికను ఎత్తివేశారు.

వరుసగా ప్రకంపనలు.. భారీ నష్టం

ప్రధాన భూకంపం తర్వాత కూడా పలు ప్రకంపనలు నమోదయ్యాయి. వాటిలో ఒకటి 6.1 తీవ్రతతో సంభవించింది. భవనాలు దెబ్బతినడంతో పాటు విద్యుత్‌ సరఫరా, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

తాజా అధికారిక సమాచారం ప్రకారం కనీసం ఐదుగురు మృతి చెందారు. శిథిలాలు పడటంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌ గవర్నర్‌ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
🏠 Home