🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 14 Aug, 2026 | Page: 1

రేణిగుంట రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

రేణిగుంట, ఆగస్టు 14 (రాజనీతి): దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో దేశభక్తి స్ఫూర్తితో ఆనందంగా జరుపుకోవాలని రేణిగుంట అర్బన్‌ సీఐ జయచంద్ర ప్రజలకు సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా రేణిగుంట పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే పోలీసు విభాగాలకు చెందిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో స్టేషన్‌ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రేణిగుంట పట్టణానికి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్‌ పరిసరాలు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాలతో పాటు అనుమానాస్పదంగా కనిపించే ప్రాంతాలను డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేసినట్లు సీఐ తెలిపారు. బస్టాండ్‌లోనూ ప్రయాణికుల భద్రతకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ జయచంద్ర ప్రజలను కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు పరస్పర సమన్వయంతో నిఘా కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రయాణికులు తమ సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదని సూచించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమైన రోజని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సోదరభావంతో వేడుకలను జరుపుకోవాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సీఐ జయచంద్ర స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేణిగుంట పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తారని ఆయన తెలిపారు.
🏠 Home