🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 13 Aug, 2026 | Page: 1

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అన్నమయ్య జిల్లా పంటల పరిశీలన


అన్నమయ్య జిల్లాలో ఎల్ నినో పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, వేసిన పంటలు ఒత్తిడికి గురవుతున్నాయని తద్వారా ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యాయని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో దెబ్బతిన్న వేరుశెనగ, పశుగ్రాస పంటలు టమోటా మొదలగు పంటలను కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు మండలాల్లో యూనివర్సిటీ బృందంతో కలిసి పరిశీలించారు. అన్ని జిల్లాలలో చాలా తక్కువ వర్షపాతం నమోదయిందనీ, పంట విస్తీర్ణం కూడా 10 శాతం మాత్రమే ఉందనీ, బోర్లలో నీరు తగ్గి పోయి పంటలు కూడా వాడి ఎండిపోతున్నాయని పరిశోధనా సంచాలకులు డాక్టర్ వి.సుమతి వివరిస్తూ, పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ డాక్టర్ కె మంజుల జిల్లాలోని పలు మండలాల్లో పంటల పరిస్థితి వివరించారు. తదుపరి వర్షాలు పడినప్పుడు, వర్షాభావ పరిస్థితులకు తట్టుకునే పంటలైన కంది, పెసర, జొన్న, ఉలవ లాంటి పంటలను వేసుకోవాలని ఉపకులపతి రైతులని కోరారు. వాడి ఎండిపోయే పొలాల సంరక్షణ, భీమా తప్ప వేరే మార్గం లేదని, బోర్ల కింద సాగవుతూ నీరు తగ్గిన పంటలకు 19:19:19 ( 5 గ్రాములు లీటరు నీటికి), 13:0:45 ( 5 గ్రాములు లీటరు నీటికి), 2% యూరియా, 1 % డిఏపి వంటి పద్దతులను పాటించాలని, ఇందుకుగాను, కెవికె శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సమయానుకూలంగా రైతులకు సలహాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి విపరీతమైన బెట్ట వాతావరణానికి తట్టుకునే వంగడాలను రూపొందించడానికి ప్రయత్నాలు మొదలు పెడతామని అన్నారు. పెల్లటైజేసన్ ప్రక్రియతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులతో పంటలు వేపించి మంచి ఉత్తీర్ణత వచ్చినప్పుడు చాలామంది రైతులు ముందుకు వస్తారని ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. 70 శాతం వర్షాలు లేక పంటలు దెబ్బతింటున్న ఈ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాo అన్నారు. రాబోవు రోజులలో పశువులకు పశుగ్రాసo కొరత ఏర్పడుతుంది, కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు పీలేరు వేపులబైలు గ్రామాలలో రైతులతో సమీక్ష నిర్వహించారు
ఈ పర్యటనలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డాక్టర్ బి.చంద్రిక మరియు శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి హరిప్రియ, వ్యవసాయ పరిశోధన స్థానం, పెరుమాళ్ళపల్లి హెడ్ డాక్టర్ రెడ్డి కుమార్ మరియు శాస్త్రవేత్తలు, కెవికె, కలికిరి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శాస్త్రవేత్తలు, విద్యార్థినీ విద్యార్థులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు
🏠 Home