ఆర్యవైశ్యులకు తగిన గౌరవం.. ప్రజాసేవే నా రాజకీయాల లక్ష్యం: ఎమ్మెల్యే గురజాల...
చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరులోని ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్యవైశ్య ప్రతినిధికి ఆలయ చైర్మన్ పదవి అప్పగించినట్లు తెలిపారు. మంచి చేయాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలపై కొందరు విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజా సమస్యలపై ఆసక్తి లేదని, రాజకీయాలే ప్రధానమైపోయాయని అన్నారు.శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా చెబుతున్నానని, తనకు రాజకీయాల కంటే ప్రజాసేవకే అధిక ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని, ఎన్ని విమర్శలు వచ్చినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.ఆర్యవైశ్య సంఘం సమర్పించిన వినతిపత్రాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామవిలాస సభ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపడతానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, శ్రీ దుర్గమ్మ దేవస్థానం చైర్మన్ బాబురావు, కూటమి నాయకులు త్యాగరాజన్, అట్లూరి శ్రీనివాసులు, సీకే లావణ్య, చంద్రప్రకాష్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.