🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Aug, 2026 | Page: 1

గోదావరి ఉద్ధృతితో రివర్‌ఫ్రంట్‌కు ముప్పు.. అప్రమత్తమైన అధికారులు.. అత్యవసర రక్షణ చర్యలు ప్రారంభం

రాజనీతి ప్రతినిధి, రాజమహేంద్రవరం | ఆగస్టు 1, 2026

ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో నగరంలోని రివర్‌ఫ్రంట్ సమీపంలో నదీ గట్టు పలు చోట్ల తీవ్రంగా కోతకు గురవుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గట్టు మరింత దెబ్బతినకుండా నిలువరించేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

పరిస్థితిని పరిశీలించిన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రక్షణ పనులు ప్రారంభించారు. ప్రవాహ వేగాన్ని తగ్గించి గట్టును కాపాడేందుకు భారీ ఎత్తున ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక రక్షణ గోడలను నిర్మిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రక్షణ చర్యలతో పరిస్థితి అదుపులోనే ఉందని, నీటి మట్టం మరికొంత పెరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇంజినీరింగ్ సిబ్బంది నది తీరంలోనే ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

మరోవైపు వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
🏠 Home