విద్యాహక్కు చట్టం తక్షణమేఅమలు చేయాల్సిందే – ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్
అన్నమయ్య జిల్లా,పుంగనూరు, రాజనీతి,జూలై 27,విద్య అనేది ప్రతి చిన్నారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, *విద్యాహక్కు చట్టం (RTE-2009)ను ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరు పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబడింది.ఈ ర్యాలీ స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు, యువత, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మధ్యలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి, విద్యాహక్కు చట్టం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన *ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు Dr. U. నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని అన్నారు. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసి, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కల్పించాల్సిన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జిల్లా అధ్యక్షులు, విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమానికి జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు భార్గవ్ సాయి,AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, AISF రాష్ట్ర నాయకులు మున్నా , వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు.ఈ మహా బహిరంగ ర్యాలీ మరియు సభకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలు అయ్యే వరకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు సురేష్, పవన్, అన్నమయ్య, ముని సాయి తదితర నాయకులతో పాటు వేలాది మంది విద్యార్థులు, యువత, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బహిరంగ సభలో పలువురు విద్యార్థి నాయకులు ప్రసంగించి, విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.